HomeCRIMEమహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..నవీపేట హత్య కేసులో న్యాయస్థానం తీర్పు.. రూ.5 వేల...

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..నవీపేట హత్య కేసులో న్యాయస్థానం తీర్పు.. రూ.5 వేల జరిమానా..పోలీసుల సమర్థ దర్యాప్తుతో నిందితుడికి శిక్ష ఖరారు

బంగారు ఆభరణాల కోసం మహిళను గొంతు నులిమి హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నవీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2025 నవంబరు 25న నమోదైన హత్య కేసులో నిందితుడు కుమురం @ పాండవాల సాగర్‌ (37)ను దోషిగా నిర్ధారిస్తూ నిజామాబాద్‌ IV అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి (ఫ్యామిలీ అండ్‌ ఉమెన్స్‌ కోర్టు) డి. దుర్గప్రసాద్‌ సోమవారం తీర్పు వెలువరించారు. మోస్రా గ్రామానికి చెందిన పాండవాల పోశెట్టి కుమారుడు సాగర్‌ కూలీగా పనిచేస్తున్నాడు.

మృతురాలు ఆకుల అనంత @ సోనీ (29) నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన గృహిణి. నిందితుడు మృతురాలికి బంధువు కావడంతో ఆమె ఇంటికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని బంగారు ఆభరణాలపై కన్నేసిన సాగర్‌.. వాటిని అపహరించాలనే ఉద్దేశంతో అదును కోసం చూశాడు.మృతురాలి తల్లి ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చిన నిందితుడు..

అనంతను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై నవీపేట పోలీసులు క్రైం నంబర్‌ 307/2025గా బీఎన్‌ఎస్‌ 103(1), 303(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కేసు దర్యాప్తును నార్త్‌ రూరల్‌ నిజామాబాద్‌ సీఐ బి. శ్రీనివాస్‌ చేపట్టి నవీపేట పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది సహకారంతో ఆధారాలను సేకరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది.బీఎన్‌ఎస్‌ 103(1) కింద నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.

303(2) కింద ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా, చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం. నీరజ ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థంగా దర్యాప్తు చేసి బలమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచిన సీఐ బి. శ్రీనివాస్‌ను పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య అభినందించారు.

ప్రారంభ దర్యాప్తు నిర్వహించిన నవీపేట ఎస్‌ఐ సి. తిరుపతి, కోర్టు లైజన్‌ సిబ్బంది టి. గోవింద్‌, సీఎంఎస్‌/సీడీవో సిబ్బంది కె. చంద్రశేఖర్‌, కె. గణేష్‌, నవీపేట సీడీవో ఎం. సుప్రియతో పాటు రైటర్లు ఆర్‌. శ్రీకాంత్‌గౌడ్‌, దత్తాద్రిగౌడ్‌, సీహెచ్‌ నాగరాజును కూడా అభినందించారు.

నేరాలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు తప్పవని, బాధితులకు న్యాయం జరిగేలా సమర్థవంతమైన దర్యాప్తుతోపాటు కోర్టు కేసుల పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ సాయి చైతన్య తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments