ఆర్టీసీ కార్మికుల తీర్పు కోసం యూనియన్లు కదనరంగంలోకి దిగాయి. గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉన్నా.. నిజామాబాద్ రీజియన్‌లో మాత్రం రెండు కూటముల మధ్యే అసలు పోరు నెలకొంది. ఎన్నికల గుర్తులు కేటాయించడంతో డిపోల వద్ద ప్రచార హోరు మొదలైంది.
కార్మికులను తమవైపు తిప్పుకునేందుకు యూనియన్లు సమావేశాలు, ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోలు, రీజినల్ మేనేజర్ కార్యాలయం పరిధిలో 1,894 మంది ఓటర్లు ఉన్నారు.
ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్-1, నిజామాబాద్-2 డిపోల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను కార్మికశాఖ విడుదల చేసింది.
అభ్యంతరాల స్వీకరణ పూర్తికావడంతో తుది జాబితాపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం నమూనా బ్యాలెట్‌ను విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ మరో అడుగు ముందుకేసింది.
రెండు కూటములు.. హోరెత్తుతున్న ప్రచారం
తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఐఎన్‌టీయూసీ ఒక కూటమిగా.. ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి.
షెడ్యూల్ కంటే ముందే ప్రధాన సంఘాలు సర్వసభ్య సమావేశాలు నిర్వహించి కార్మికులను సమాయత్తం చేశాయి. ఇప్పుడు డిపోల వారీగా ప్రచారానికి పదును పెట్టాయి. రీజియన్ స్థాయి క్లాస్-6లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎన్ఎంయూ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది.
‘విల్లు–బాణం’ గుర్తుతో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్.. మరోవైపు ‘బస్సు–నిచ్చెన’ గుర్తుతో ప్రత్యర్థి వర్గం ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. కార్మికుల సమస్యలు, తమ సంఘాల గత కార్యాచరణను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీ మరింత వేడెక్కుతోంది. గుర్తింపు ఎన్నికల్లో ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాలి. క్లాస్-3లో రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం.. క్లాస్-6లో రీజియన్ స్థాయి గుర్తింపు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి.
తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయిలోనూ పోటీ చేస్తుండగా.. క్లాస్-3లో ఎంప్లాయీస్ యూనియన్ బరిలో ఉంది.
టీపీసీసీ మద్దతు
కాంగ్రెస్ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమన్వయంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర యూనియన్లకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఆ సంఘానికి సహకరించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. దీంతో రీజియన్‌లో రాజకీయ మద్దతు కూడా ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా మారింది.
డిపోల వారీగా ఓటర్లు
ఆర్మూర్ – 268
బాన్సువాడ – 315
బోధన్ – 345
కామారెడ్డి – 400
నిజామాబాద్-1 – 356
నిజామాబాద్-2 – 174
ఆర్‌ఎం కార్యాలయం – 36
మొత్తం – 1,894
