కాంగ్రెస్ మద్దతు సంఘానికి ఒక్క డిపోతోనే సరిపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లాలో ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు ఆర్టీసీ డిపోలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్–తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఐదు డిపోల్లో ఆధిక్యం సాధించగా.. కాంగ్రెస్ మద్దతున్న వర్కర్స్ యూనియన్ నిజామాబాద్-2 డిపోకే పరిమితమైంది.
సొంత జిల్లాలో కార్మిక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు వర్గం ఒక్క డిపోతోనే సరిపెట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్-1, నిజామాబాద్-2, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది.
మొత్తం 1,927 ఓట్లకుగాను 1,825 ఓట్లు పోలయ్యాయి. సుమారు 98 శాతం పోలింగ్ నమోదైంది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నిజామాబాద్ ఆర్‌ఎం కార్యాలయ పరిధిలో 36 ఓట్లకుగాను 34 పోలవగా.. టీఎంయూకు 29 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్-1 డిపోలో 365 ఓట్లకుగాను 354 పోలయ్యాయి. వీటిలో టీఎంయూకు 318 ఓట్లు లభించాయి. బోధన్‌లో 357 ఓట్లకుగాను 332 పోలవగా.. టీఎంయూకు 276 ఓట్లు వచ్చాయి. ఆర్మూరులో 272 ఓట్లకుగాను 254 పోలయ్యాయి.
టీఎంయూకు 225 ఓట్లు లభించాయి. కామారెడ్డిలో 408 ఓట్లకుగాను 395 పోలవగా.. టీఎంయూకు 271 ఓట్లు వచ్చాయి. బాన్సువాడలో 315 ఓట్లకుగాను 312 ఓట్లు పోలవగా.. టీఎంయూకు 252 ఓట్లు లభించాయి. నిజామాబాద్-2 డిపోలో కాంగ్రెస్ మద్దతున్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఆధిక్యం సాధించింది.
దీంతో ఆరు డిపోల్లో ఐదింట కూటమి ఆధిక్యం సాధించగా.. కాంగ్రెస్ మద్దతు సంఘం ఒక్క డిపోకే పరిమితమైంది.అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, అక్టోబర్ 17న ఎన్నికల అధికారులు అధికారిక తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.
అధికార కాంగ్రెస్‌కు ఆర్టీసీ కార్మికుల షాక్‌ఆర్టీసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లాలోనే కాంగ్రెస్ మద్దతున్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఒక్క డిపోకే పరిమితం కాగా.. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఐదు డిపోల్లో ఆధిక్యం సాధించింది.
అధికార పార్టీ మద్దతు, రాజకీయ అండదండలు ఉన్నా కార్మిక సంఘాల ఎన్నికల్లో మెజారిటీ డిపోలను గెలుచుకోలేకపోవడం కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారింది.అండదండలున్నా.. దక్కని ఆధిక్యం!కార్మిక సంఘాల ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు ఎంత ఉన్నా.. చివరకు ఓటు వేసేది కార్మికులే. ఉమ్మడి జిల్లాలో వెలువడిన ఫలితాలు ఇదే విషయాన్ని మరోసారి చాటిచెప్పాయి.
కాంగ్రెస్ మద్దతు సంఘానికి ఒక్క డిపోతోనే సరిపెట్టుకోవాల్సి రాగా.. ప్రత్యర్థి కూటమి ఐదు డిపోల్లో ఆధిక్యం సాధించింది. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఎదురుకావడం పార్టీకి ఆత్మపరిశీలన అంశంగా మారింది. కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎదురైన ఈ ఫలితాలు రానున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ రాజకీయ వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
