సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై బండరాయితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని న్యూఎన్జీవోస్ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గంగోని వినోద్, అతని స్నేహితుడు జయంత్ మద్యం మత్తులో ఉండగా సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జయంత్ బండరాయితో వినోద్ తలపై బలంగా కొట్టాడు. దీంతో వినోద్ తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. గమనించిన వారు వెంటనే వినోద్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 11వ తేదీ రాత్రి వినోద్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.
