HomeTelanganaNizamabadవామ్మో.. వన్‌వేనా! ఆర్‌యూబీ పనులతో నగరంలో ట్రాఫిక్‌ గండం.. ... పది నిమిషాల ట్రయల్‌కే అస్తవ్యస్తం...

వామ్మో.. వన్‌వేనా! ఆర్‌యూబీ పనులతో నగరంలో ట్రాఫిక్‌ గండం.. … పది నిమిషాల ట్రయల్‌కే అస్తవ్యస్తం … రెండు నెలల పాటు నగరవాసులకు నరకయాతనేనా? తలలు పెట్టుకుంటున్న పోలీసులు..

నిజామాబాద్‌ నగరంలో వన్‌వే అంటేనే ట్రాఫిక్‌ పోలీసులకు గుబులు పుడుతోంది! నిత్యం వేలాది వాహనాలతో కిటకిటలాడే కంఠేశ్వర్‌–నిజామాబాద్‌ ప్రధాన మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

ఈ వారంలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలుండటంతో వాహనాల రాకపోకలు నిలిపివేయాలని రైల్వే అధికారులు పోలీసులకు లేక పంపారు. దీంతో ప్రత్యామ్నాయ ట్రాఫిక్‌ మార్గాలపై పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అయితే వన్‌వే అమలు చేస్తే నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో ఏ మార్గంలో వాహనాలను మళ్లించాలన్నది పోలీసులకు సవాల్‌గా మారింది.

ఆర్‌యూబీ వద్ద పనులు ప్రారంభమైతే ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తప్పవు. పనులు సుమారు రెండు నెలలపాటు కొనసాగనున్న నేపథ్యంలో అప్పటివరకు ట్రాఫిక్‌ను ఎలా క్రమబద్ధీకరించాలన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వన్‌వే అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

మరోవైపు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తే అక్కడా రద్దీ పెరిగే అవకాశముంది. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బస్టాండ్‌ నుంచి నామ్‌దేవ్‌వాడి వైపు వాహనాలను మళ్లించే ప్రతిపాదనపై ఇప్పటికే ఒకరోజు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

అయితే కేవలం పది నిమిషాల పరీక్షకే ట్రాఫిక్‌ రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. అదే మార్గంలో పూర్తిస్థాయిలో వన్‌వే అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాహనాల రద్దీ, రహదారుల పరిమిత వెడల్పు, కూడళ్ల వద్ద ఏర్పడే ఒత్తిడి పోలీసులకు తలనొప్పిగా మారనున్నాయి.ట్రాఫిక్‌ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాల ఎంపిక ఒక్కటే పరిష్కారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారులను అందుబాటులోకి తెస్తే వాహనాల రాకపోకలకు కొంత వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు మున్సిపల్‌ సిబ్బంది, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సహకారం అవసరం. రహదారులపై ఆక్రమణలను తొలగించి, పార్కింగ్‌ క్రమబద్ధీకరణ చేపట్టి, ప్రత్యామ్నాయ మార్గాల్లో అడ్డంకులను గుర్తిస్తేనే ట్రాఫిక్‌ నిర్వహణ సులభమవుతుంది.

ఆర్‌యూబీ పనులు ప్రారంభమయ్యేలోపే ట్రాఫిక్‌ మళ్లింపులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. వాహనదారులకు ముందస్తు సమాచారం, కీలక కూడళ్ల వద్ద అదనపు సిబ్బంది, సూచిక బోర్డులు, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు చేపట్టాలి.

లేదంటే పనులు పూర్తయ్యే వరకు నగర ప్రజలు నిత్యం ట్రాఫిక్‌ తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వన్‌వే పేరుతో వాహనాలను దారి మళ్లించడం కంటే.. ఆ మార్గాల్లో రద్దీని తట్టుకునే ఏర్పాట్లు చేయడమే అసలు సవాల్‌ గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments