భక్తుల జయజయధ్వానాలు.. మహిళల మంగళహారతులు.. ఆధ్యాత్మిక వాతావరణం నడుమ శ్రీ దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో శ్రీ దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం అమ్మవారి నిమజ్జనంతో భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి.
ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయం నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్రగా బాసర పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారు. అక్కడ గోదావరి నది వద్ద వేదోక్త సంప్రదాయాల ప్రకారం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. నిమజ్జన శోభాయాత్రలో మహిళలు మంగళహారతులతో పాల్గొని అమ్మవారికి వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ.. శ్రీ దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు భక్తుల సహకారం, భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు.
తొమ్మిది రోజులపాటు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని పేర్కొన్నారు. లోకార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు వాల బాలకిషన్, మద్ది గంగాధర్, బొడ హనుమండ్లు, కొండా నాగేందర్, దర్శనం రాజు, కొమ్ము సురేష్, శ్రీకాంత్, అనిల్, సాయితేజ, సందీప్‌తో పాటు మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
