బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు
మాధవనగర్ ఆర్వోబీపై వచ్చే వారం ఆందోళనలకు హెచ్చరిక
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరంగా మారాల్సిందిపోయి.. బీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలకు, అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.
బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ల మార్పులు, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృథా అయిందని, కేవలం కల్వకుంట్ల కుటుంబానికి లాభం అయ్యిందని ఆరోపించారు.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఉద్యమ నినాదాలు ఇచ్చిన కేసీఆర్.. ‘లక్షల ఎకరాల మాగాణి’ అంటూ రైతులకు ఆశలు కల్పించి, చివరకు తెలంగాణను లక్ష కోట్ల ఖజానాగా మార్చుకుని తన కుటుంబం జేబులో వేసుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటులోనే సుమారు రూ.లక్ష కోట్లు నీటిపాలయ్యాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఒక ప్రభుత్వం నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే.. మరో ప్రభుత్వం లోపాలను సరిదిద్దడంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలను సాకుగా చూపకుండా ముందస్తుగా ప్రాజెక్టు బ్యారేజీలు దెబ్బతిన్నా, వాటిని సకాలంలో మరమ్మతు చేసి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదని పేర్కొన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తొలుత అనుకున్న డిజైన్లకు, తర్వాత అమలు చేసిన విధానాలకు మధ్య తేడాలున్నాయని అరవింద్ పేర్కొన్నారు. జియోటెక్నికల్ అధ్యయనాలు, నాణ్యతా ప్రమాణాలు, నిర్మాణ పద్ధతులపై అనేక ప్రశ్నలు తలెత్తాయని చెప్పారు.
2023 లోనే బ్యారేజీల్లో సమస్యలు బయటపడినప్పుడు తగిన మరమ్మతులు చేపట్టి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా మారేది కాదన్నారు. ఆనాటి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అప్పట్లోనే పరిశీలించి, మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
అయినప్పటికీ సరైన సమయంలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతుల్లోనూ ఉండవని, అయితే వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు, పటిష్ఠమైన నీటిపారుదల వ్యవస్థలు అవసరమని అన్నారు.బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగంతోపాటు వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.
పంటల సాగును నిలిపివేయాలని సూచించే ముందు, రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని అన్నారు. పంటల ప్రణాళిక, సాగునీటి నిర్వహణ, పాత ప్రాజెక్టుల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
రెండేళ్లుగా మాధవనగర్ ఆర్వోబీకి మోక్షమెప్పుడు?
నిజామాబాద్‌లో కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 అక్టోబరు 22న అదనపు అంచనాలు, డిజైన్ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆర్థిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
బ్లాక్ సాయిల్ కారణంగా పునాది డిజైన్‌లో మార్పులు చేయాల్సి రావడంతో సుమారు రూ.9 కోట్ల అదనపు వ్యయం అవసరమైందని వివరించారు. ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడానని, రోడ్లు–భవనాల శాఖ మంత్రితోనూ చర్చించినట్లు చెప్పారు.
అయినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం, నిధుల విడుదలలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడం సమస్యగా మారాయని పేర్కొన్నారు.
వచ్చే వారం ఆందోళనలు
అర్సపల్లి ఆర్వోబీ పనులు, భూసేకరణ, పెండింగ్ బిల్లులు, మాధవనగర్ నిర్మాణ పురోగతిపై అధికారులు తక్షణమే స్పందించాలని అరవింద్ కోరారు. రైల్వే శాఖకు సంబంధించిన పనులు పూర్తయిన చోట రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పనులే మిగిలాయని చెప్పారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తామని, వచ్చే వారం మాధవనగర్ ఆర్వోబీ అంశంపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బోధన్ ఫ్లైఓవర్లు, ఇతర ఆర్వోబీల నిర్మాణంలోనూ ప్రతిపాదనలు, అనుమతులు, నిధుల విడుదల వేగవంతం కావాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని సూచించారు.
పసుపు ధరపై బాండ్ పేపర్ హామీ
బీజేపీ ప్రభుత్వం వస్తే పసుపునకు క్వింటాలుకు రూ.50 వేల ధర సాధించి చూపిస్తానని గతంలో హామీ ఇచ్చినట్లు అరవింద్ పేర్కొన్నారు. అవసరమైతే బాండ్ పేపర్‌పై రాసి ఇస్తానని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. పసుపు రైతుల ప్రయోజనాల కోసం తన హామీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధాన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర సభ్యులు స్రవంతి రెడ్డి. బీజేపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
