HomeLaw and Orderఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు...ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు…ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, అక్టోబర్ 24 : జిల్లాలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం లోటు ఏర్పడి కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీకి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చైర్మన్‌గా వ్యవహరించనుండగా, జిల్లా వ్యవసాయ అధికారిని మెంబర్ కన్వీనర్‌గా, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి, మిషన్ భగీరథ సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కమిటీ సభ్యులుగా ఉన్నారు.


కరువు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించడం, కరువు నివారణ ప్రణాళిక అమలు తీరును నిశితంగా పరిశీలించడం తదితర బాధ్యతలను ఈ కమిటీ నిర్వర్తిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

వర్షపాతం లోటు, భూగర్భ జలాల స్థితిగతులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ప్రతి వారం సమీక్షించడం,
ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం,
సంబంధిత శాఖల ద్వారా కరువు నివారణ చర్యల అమలును పర్యవేక్షించడం,
పంటల వైవిధ్యీకరణ, తాగునీటి సరఫరా, పశువులకు దాణా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై జిల్లా స్థాయి కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు.

కరువు ప్రభావం నెలకొనేందుకు అవకాశం ఉన్న మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి తక్షణ నివారణ చర్యలు చేపట్టడం, వాస్తవ పరిస్థితులపై రోజువారీ నివేదికలను సమర్పిస్తుందని, తద్వారా ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments