HomeTelanganaNizamabadప్రారంభమైన మాధవనగర్‌ ఆర్‌ఓబీపై బీజేపీ దీక్ష...

ప్రారంభమైన మాధవనగర్‌ ఆర్‌ఓబీపై బీజేపీ దీక్ష…

నిజామాబాద్‌ మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణంలో జాప్యానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం దీక్ష ప్రారంభమైంది. బ్రిడ్జి పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

అసంపూర్తి నిర్మాణంతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, ముఖ్యంగా విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగుతోంది.

పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు దీక్షకు తరలివచ్చి మద్దతు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

మాధవనగర్‌ ఆర్‌ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచడంతోపాటు ఎంపీ అర్వింద్‌ నిధుల మంజూరుకు కృషి చేసినప్పటికీ పనుల్లో పురోగతి లేకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదనపు పనులకు సంబంధించి సుమారు రూ.9 కోట్ల ప్రతిపాదనలు రెండేళ్లుగా ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. నిధులు విడుదల చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల నుంచి వాహనదారుల వరకు..

బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో మాధవనగర్‌ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వాహనదారులు ప్రతిరోజూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ సమయంలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణ సమయం పెరుగుతోందని, అత్యవసరంగా వెళ్లాల్సిన వారికీ ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

మాధవనగర్‌తోపాటు అర్సపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని, అర్సపల్లి బ్రిడ్జికి అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని కోరారు. ప్రజా సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments