అనవసర అపోహలు, వదంతులను వ్యాప్తి చేయవద్దు
రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, అక్టోబర్ 28 : బియ్యం ధరలను నియంత్రణలో ఉంచేందుకు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బియ్యం నిల్వలు, సరఫరా, విక్రయాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను పెంచేందుకు ప్రయత్నించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల అతిక్రమణకు పాల్పడే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛ విపణిలో బియ్యం ధరలు, వాటి క్రయ విక్రయాలు, సన్న బియ్యం సేకరణ స్టాక్ వివరాలు తదితర అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు నిత్యావసరమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. మార్కెట్లో బియ్యం లభ్యత, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బియ్యం క్రయ విక్రయాలలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ కొరత ఉన్నట్లు చూపించడం, ఉద్దేశపూర్వకంగా సరఫరాను తగ్గించడం, ధరలను కృత్రిమంగా పెంచేందుకు ప్రయత్నించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలని, నిల్వలు, కొనుగోళ్లు, విక్రయాల విషయంలో నిబంధనలు తుచ తప్పక పాటించాలని సూచించారు.
బియ్యం ధరలు, నిల్వలు, సరఫరాకు సంబంధించి ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించే రీతిలో అపోహలు, వదంతులను వ్యాప్తి చేయవద్దని కలెక్టర్ కోరారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటంతో పాటు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు వ్యాపారులు సహకరించాలని అన్నారు.
జిల్లాలో బియ్యం ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్లో ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా అనవసర అపోహలకు గురై అవసరానికి మించి బియ్యం నిల్వలను కొనుగోలు చేయవద్దని కలెక్టర్ హితవు పలికారు. బియ్యం ధరల స్థిరత్వానికి జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రేడర్లు పాల్గొన్నారు.
