HomePOLITICAL NEWSUncategorizedవ్యక్తి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రూ.5 వేల జరిమానా

వ్యక్తి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రూ.5 వేల జరిమానా

దూషించాడన్న కోపంతో ఓ వ్యక్తిని కట్టెతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్‌ సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. రూ.5 వేల జరిమానా చెల్లించాలని, లేకుంటే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని సెషన్స్‌ జడ్జి జి.వి.ఎన్‌. భారత లక్ష్మి బుధవారం ఆదేశించారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ రూరల్‌ మండలం కొత్తపేట మల్కాపూర్‌కు చెందిన తాటిపాముల శివప్రసాద్‌గౌడ్‌, బైరి నర్సగౌడ్‌ గ్రామానికి చెందినవారు. 2024 జూన్‌ 6న ఉదయం శివప్రసాద్‌గౌడ్‌ దైవదర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో నర్సగౌడ్‌ ఎదురయ్యాడు.

తనను దూషించాడన్న కోపంతో సమీపంలో ఉన్న కట్టెతో శివప్రసాద్‌ తలపై దాడి చేశాడు.అయినా కోపం చల్లారని నర్సగౌడ్‌ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శివప్రసాద్‌ ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న కట్టెతో తలపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివప్రసాద్‌ను కుటుంబ సభ్యులు తొలుత నగరంలోని ప్రగతి ఆసుపత్రికి, అనంతరం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన ఆయన బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే శివప్రసాద్‌ మృతిచెందాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

విచారణలో భాగంగా కోర్టు 21 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు 19 పత్రాలు, ఒక వస్తుగత సాక్ష్యాన్ని పరిశీలించింది. ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ వాదనలు విన్న అనంతరం నర్సగౌడ్‌పై హత్య నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు.

కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు ఎస్‌ఐలు జె. రామారావు, జి. మహేష్‌, సీఐలు ఎస్‌. సతీష్‌, ఎన్‌. సురేష్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి. రాజేశ్వర్‌రెడ్డి, బ్రీఫింగ్‌ ఆఫీసర్‌ సీహెచ్‌. శ్రీనివాస్‌, కోర్టు లైజన్‌ అధికారి టి. గోవింద్‌తో పాటు కోర్టు సీఎంఎస్‌, సీడీఓ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments