విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) జిల్లా ఇన్‌చార్జి అఖిల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్–ఆర్మూర్ మార్గంలో మాణిక్‌భండార్ స్టేజీ వద్ద బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్గాం (కే), మాణిక్‌భండార్, అమ్రాద్, ఒడ్డెడ్‌పల్లి ప్రాంతాల విద్యార్థుల కోసం మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సరిపడా బస్సులు నడపకపోవడం వారి భద్రతకు ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.నిజామాబాద్–ఆర్మూర్ మార్గంలో వీఆర్‌ఈసీ, కిట్స్, కేఈసీఏ కళాశాలలకు వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని అఖిల్ తెలిపారు.
మాణిక్‌భండార్ వద్ద బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే స్పందించి అక్కడ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు సరిపోకపోవడంతో 18 ఏళ్లు నిండని విద్యార్థులు సైతం లైసెన్సులు లేకుండా ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనివల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పొంచి ఉందని, విద్యార్థుల చదువులకు కూడా ఆటంకం కలుగుతోందని అన్నారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్, రీజినల్ మేనేజర్‌ను డిమాండ్ చేశారు.
సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి నిజామాబాద్ బస్టాండ్‌ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ నాయకులు సుజిత్, హేమంత్, నైతిక్ తదితరులు పాల్గొన్నారు.
