HomeTelanganaNizamabadఫీజుల కోసం ఇందూరు నుంచి రణభేరి... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి...

ఫీజుల కోసం ఇందూరు నుంచి రణభేరి… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం! ఫీజులు చెల్లించండి.. లేదంటే ఉద్యమమే! తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్

ఒకప్పుడు లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఊపిరి కోసం ఎదురుచూస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

వేల కోట్ల బకాయిలతో విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ.. బకాయిలు విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఒక సామాన్య పథకం కాదని, ఇది లక్షలాది మంది జీవితాలను మార్చిన సంక్షేమ దీపమని పేర్కొన్నారు.

“ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలోచన పుట్టిందే ఇందూరు గడ్డపై. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని ఒప్పించి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసిన ఘనత డి.శ్రీనివాస్ దే. ఆ స్కీమ్ వల్లే నేడు వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారు.

దేశ జీడీపీని పెంచిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వేలాది మంది తెలుగు యువత విజయాల వెనుక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే కారణమని అరవింద్ అన్నారు.

2004లో ధర్మపురి శ్రీనివాస్ చొరవతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ఈ పథకాన్ని అమలు చేయించారని గుర్తు చేశారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయని, ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పడం విద్యార్థులను మోసం చేయడమేనని మండిపడ్డారు.

ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం జూలై 31లోపు రెండో, మూడో, నాలుగో సంవత్సరం విద్యార్థుల బకాయిలు, ఆగస్టు 15లోపు మొదటి సంవత్సరం విద్యార్థుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.నిత్యం ప్రభుత్వ భూములను అమ్మగా వస్తున్న వేల కోట్ల రూపాయల ఆదాయం ఏమవుతోంది? బకాయిలు చెల్లించడానికి ఆ సొమ్ము ఎందుకు సరిపోవడం లేదు? అని ప్రశ్నించారు.

ఇటీవల ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా విద్యార్థుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలైన భరోసా కార్డు, ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ తదితర వాగ్దానాలను అమలు చేయలేదని విమర్శించారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి కాలక్షేపం చేస్తోందని అన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అందడం లేదని, మంచి ర్యాంకులు సాధించిన వారికే పరిమితమవుతోందని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, భవిష్యత్ తరాల అభివృద్ధికి సంబంధించిన అంశమని ఎంపీ అరవింద్ చెప్పారు. ఈ పథకాన్ని కాపాడేందుకు బీజేపీ, ఏబీవీపీతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రణభేరి మోగిస్తామని, ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల చేయించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.‘

కమిషన్ బాక్స్’ ఏర్పాటు చేసి నిరసన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు 40 శాతం కమిషన్ ఇస్తేనే నిధులు విడుదల చేస్తామని కళాశాల యాజమాన్యాలతో చర్చించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. దీనికి నిరసనగా సభా ప్రాంగణంలో ‘కమిషన్ బాక్స్’ ఏర్పాటు చేసి విద్యార్థులతో ప్రతీకాత్మకంగా నగదు వేయించారు.

“40 శాతం కమిషన్ మేమే ఇస్తాం.. వెంటనే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయండి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఇందూరు నుంచి ప్రారంభమైన ఈ రణభేరిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, కొడంగల్ వరకు భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

డేంజరస్ కాదది.. డిజాస్టర్!

అశోక్ నగర్ లైబ్రరీ వద్ద విద్యార్థులను రెచ్చగొట్టి, కేసీఆర్‌ను గద్దె దించి, ఇప్పుడు అదే విద్యార్థులను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. కేసీఆర్ అప్పుల పాలు చేస్తే, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అగాధంలోకి నెడుతున్నారు. కేసీఆర్ డేంజరస్ అయితే, రేవంత్ రెడ్డి డిజాస్టర్.

ఈ ముఖ్యమంత్రి పదేళ్లు కాదు కదా, ప్రజలు కోరుకుంటే పది రోజులు కూడా అధికారంలో ఉండలేరు.మనవడితో ఆడుకోవడానికి ఉన్న సమయం, పరిపాలనపై పెట్టడం లేదని, విద్యార్థుల జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుతున్నారని ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విద్యాశాఖను నిర్వీర్యం చేశారు.

విద్య లేని మంత్రిని విద్యాశాఖకు కేటాయించడం విడ్డూరం. మీ గురువు చంద్రబాబు వద్దకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ పాఠాలు, ఏబీసీడీలు నేర్చుకోమనీ ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజా సంఘాలు, మేధావులు, యువత ఏకం కావాలి. ఇందూరు గడ్డ మీద మొదలైన ఈ రణభేరి, కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి నాంది పలుకుతుందని ఎంపీ అరవింద్ హెచ్చరించారు.

ఈ రణభేరి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యదర్శి సభ్యులు గోపిడి స్రవంతి రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ ఇతర కార్పొరేటర్లు విద్యార్థి సంఘాల నాయకులు సుమారు 1500 వరకు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments