నగర పాలక సంస్థలో మంగళవారం నిర్వహించిన మొదటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, ప్రజా సమస్యల పరిష్కారంపై స్పష్టత లేని ‘మమా అనిపించే’ కార్యక్రమంగా మిగిలిపోయింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్ల దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ మేయర్, ముందు వాపోయినా, కనీస భరోసా లభించకపోవడం గమనార్హం.
సమావేశానికి హాజరైన 60 మంది కార్పొరేటర్లలో పదిమంది మినహా మిగిలిన వారంతా కొత్తవారే. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలపై వారు గళమెత్తారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో నగరం చీకటిమయంగా మారుతోందని, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పలువురు సభ్యులు నిలదీశారు.
మురుగునీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయని, దోమల బెడదతో ప్రజలు అల్లాడుతున్నా, శానిటేషన్ వ్యవస్థ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కీలక విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల పనులు కుంటుపడుతున్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యకు అధికారులు ఒకే రకమైన ‘స్క్రిప్టెడ్’ సమాధానం ఇచ్చారు. “అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. నివేదిక అందజేస్తాం” అంటూ చేతులు దులుపుకున్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారు? ఎన్ని రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తారు? అన్న విషయమై కనీసం ఒక స్పష్టమైన తేదీని గానీ, సమయాన్ని గానీ అధికారులు ప్రకటించకపోవడం సభ్యుల్లో తీవ్ర అసహనానికి దారితీసింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే ఈ తతంగం నడవడం గమనార్హం. సమస్యల పరిష్కారం కోసం గట్టిగా నిలదీయాల్సింది పోయి, అధికారుల మాదిరిగానే ప్రభుత్వానికి తెలియజేస్తామన్న మొక్కుబడి సమాధానంతో ఆయన సరిపెట్టుకోవడంతో, సమావేశం ఒక ఫార్మాలిటీగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం, నగర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి రోడ్ మ్యాప్ లేకుండానే ముగియడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజాప్రతినిధులు, కనీసం అధికారులను నిలదీసే స్థాయిలో కూడా లేకపోతే, ఇక నగర అభివృద్ధిని ఎవరిని అడగాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
