సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పట్ల ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని, లేనిపక్షంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని 21వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లలితా చరణ్ హెచ్చరించారు. శుక్రవారం 21వ డివిజన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో ఆమె మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ కృపాకర్ రెడ్డికి బీఎల్ఓ అందించే ఎన్యూమరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం కార్పొరేటర్ లలితా చరణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అత్యంత విలువైనదని, ఇది మన ప్రాథమిక గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి ఓటు హక్కు ఉండటమే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.
డివిజన్ ప్రజలందరూ సర్వే కోసం వచ్చే అధికారులకు తమ వివరాలను వాస్తవంగా అందించాలని కోరారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలని, కార్డుల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని సూచించారు.
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా అధికారులకు పక్కాగా నివేదించాలని కోరారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే అది చట్టవిరుద్ధమని, అట్టి వివరాలను సవరించాలని చెప్పారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తమను సంప్రదించాలని ఆమె ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రత్యేక అధికారి ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ ఐశ్వర్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షోయబ్, బూత్ లెవల్ ఆఫీసర్లు, డివిజన్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
