నమ్మకమే పెట్టుబడిగా స్కానింగ్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు, యజమాని కళ్లుగప్పి లక్షల రూపాయలను కాజేశారు. నకిలీ రసీదులను తయారు చేస్తూ సుమారు ఆరు సంవత్సరాలుగా సంస్థకు రూ. 70 లక్షలకు పైగా నష్టం కలిగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా కేంద్రంలో 2009 నుంచి నిర్వహిస్తున్న ఓ ప్రముఖ స్కానింగ్ కేంద్రంలో మాణిక్ భండార్ గ్రామానికి చెందిన గుండారం సత్యనారాయణ సూపర్ వైజర్‌గా, టి. మీనా మరో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
వీరు ఇద్దరూ కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల మధ్య కార్బన్ పేపర్‌ను తొలగించి, రికార్డుల్లో తక్కువ మొత్తాన్ని చూపిస్తూ నకిలీ రసీదులను సృష్టించారు. రోగుల నుంచి పూర్తి సొమ్ము వసూలు చేసి, కార్యాలయ రికార్డుల్లో మాత్రం తక్కువగా నమోదు చేస్తూ రోజువారీ నగదును దుర్వినియోగం చేశారు.
ఈ అక్రమ తతంగం సుమారు ఆరేళ్లుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై ఇతర ఉద్యోగులకు అనుమానం రాకుండా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇటీవల యజమాని నిశితంగా పరిశీలించగా విషయం బయటపడింది. దీనిపై ఆయన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి వివరాలు వెల్లడించారు. సత్యనారాయణ, మీనాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సత్యనారాయణ తన భార్య పేరు మీద భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
దీంతో సత్యనారాయణ, మీనా మరియు సత్యనారాయణ భార్యపై కేసు నమోదు చేశారు.శుక్రవారం మాణిక్ బండార్ గ్రామంలో సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.
