ధ్వజంమహిళా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రామకృష్ణ మండిపడ్డారు.
ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందనేది పచ్చి అబద్ధమని, వాస్తవానికి 2023లోనే పార్లమెంటులో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు.
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయకుండా, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టడాన్ని రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. “ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
కానీ, బీజేపీ తన రాజకీయ ఎజెండా కోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మరియు దేశ సమాఖ్య స్వరూపం దెబ్బతింటుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మహిళా సాధికారతపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఈ అంశాన్ని కేవలం ఎన్నికల ప్రచార సాధనంగానే వాడుకుంటోందని విమర్శించారు.
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ముసుగులో రిజర్వేషన్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, మహిళల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా పక్షపాతేనని, ప్రజాస్వామ్య సంస్థల్లో మహిళలకు సముచిత వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, మడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి పాల్గొన్నారు.
అలాగే జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, సాయిబాబా గుడి చైర్మన్ గంగాకిషన్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు అష్రఫ్ తదితరులు పాల్గొని బీజేపీ తీరును నిరసించారు.
