ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగించేలా బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) చొరవ తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ కోరారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట మండలంలో జరిగిన బీఎల్‌ఏల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది.
ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా బీఎల్‌ఏలు పనిచేయాలి. జాబితాలో తప్పులు లేకుండా చూడటంతో పాటు, అనర్హుల పేర్లను తొలగించడంలో ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేశారు.
పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి, ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నాయకులు వినయ్‌రెడ్డి, తాహెర్ బిన్ తదితరులు పాల్గొన్నారు.
