పోలీస్‌స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోటల్ వ్యాపారి..
90 శాతం కాలిన గాయాలు.. పరిస్థితి విషమం
భీంగల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోటల్ వ్యాపారి పొలాస సుధాకర్‌కు న్యాయం చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. భీంగల్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో సుధాకర్‌కు సుమారు 90 శాతం కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
భీంగల్ పట్టణంలో సుధాకర్ హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ ముందు రోడ్డుపై టేబుళ్లు ఏర్పాటు చేసిన విషయమై పోలీసులు తరచూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్ ఆరోపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు రావాలని తనకు ఫోన్ చేశారని చెప్పారు. గతంలోనూ ఇదే తరహాలో తనపై కేసులు నమోదు చేసి కోర్టు చుట్టూ తిప్పారని, ఆ విషయంతో తాను తీవ్రంగా భయపడుతున్నానని సుధాకర్ చెప్పినట్లు తెలిపారు.
తాను ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు వినడం లేదని, తరచూ కోర్టు కేసులు పెడుతున్నారనే మనస్తాపంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుధాకర్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
తన హోటల్ పక్కనే ఉన్న మరో షాపు వ్యక్తి కూడా తనను వేధిస్తున్నాడని సుధాకర్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ వ్యక్తి వ్యవహారంపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలు, షాపు వ్యక్తి వేధింపులపై సమగ్ర విచారణ జరిపి సుధాకర్‌కు న్యాయం చేయాలని కోరారు.
సుధాకర్ ఒంటిపై నిప్పంటించుకోవడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరానికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై అంబులెన్స్ రప్పించి తొలుత చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరోవైపు సుధాకర్‌పై కావాలనే వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. రాత్రి నిర్ణీత సమయం దాటిన తర్వాత హోటల్ నిర్వహించినందుకు కేసు నమోదు చేశామని తెలిపారు.
సంబంధిత కేసును కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించామని పేర్కొన్నారు. కేసు విషయంలో కోర్టుకు హాజరుకాకుండా సుధాకర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.
