కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ శుక్రవారం రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు.
బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కాగా, పాఠశాలలో 418 మంది విద్యార్థినులు కొనసాగుతున్నారని, పాఠశాలకు కొత్త బియ్యం నిల్వలు కేటాయించినందున వండిన సమయంలో అన్నం కొంత మెత్తగా అవుతోందని పాఠశాల ప్రిన్సిపాల్ అర్షియా నజమ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీంతో స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్ డీ.ఎం కు ఫోన్ చేసి పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పాత బియ్యం నిల్వలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కింద ఇటీవలే నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు..
