రైలు మార్గంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వీరి వద్ద నుండి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ బృందం రైల్వే స్టేషన్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్‌కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్ అనే వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 5.1 కిలోల గంజాయితో పాటు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏ. గంగాధర్,మల్లేష్,ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, కానిస్టేబుల్స్ దేవేందర్, శైలేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
