దశాబ్దాలుగా విద్యార్థులు, ప్రజలు ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్ సీట్ల పెంపు కల సాకారమైంది. కళాశాలలో ఉన్న 120 సీట్లను 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అదనంగా 30 సీట్లకు సంబంధించి అధికారిక అనుమతి పత్రాన్ని సోమవారం కళాశాల యాజమాన్యానికి అందజేసింది. వైద్య కళాశాలలో వసతులు, అధ్యాపకుల నియామకాలు, బోధనా పద్ధతులపై ఎన్ఎమ్‌సీ నిరంతరం నిఘా ఉంచింది.
ఇందులో భాగంగానే జూన్ 17న ఎన్ఎమ్‌సీకి చెందిన నలుగురు అసెస్సర్ల బృందం ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. కళాశాలలో అందుబాటులో ఉన్న వసతులు, ఆసుపత్రిలోని వైద్య సేవలు, ల్యాబ్లు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అసెస్‌మెంట్ బోర్డు, అదనపు సీట్ల మంజూరుకు పచ్చజెండా ఊపింది.
ఈ సీట్ల పెంపుతో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మరిన్ని వైద్య సీట్లు అందుబాటులోకి వచ్చాయని, ఇది స్థానిక విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు.
అదనపు సీట్ల మంజూరు ద్వారా బోధన, వైద్య సేవలు మరింత విస్తృతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో సీట్లు పెరగడంపై జిల్లా వైద్య వర్గాలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
