మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బుధవారం (ఫిబ్రవరి 11న) జరగనున్న ఎన్నికల పోలింగ్, అనంతరం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆయన, అనంతరం భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఉండాలి.
కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి” అని ఆదేశించారు. భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసిన ఆయన, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా 144 సెక్షన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, సీఐ లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
