HomeHEALTHజూనియర్ డాక్టర్ల బకాయిల విడుదలలో జాప్యం..

జూనియర్ డాక్టర్ల బకాయిల విడుదలలో జాప్యం..

జూనియర్ డాక్టర్లకు రావాల్సిన గత ఏడాది బకాయిల విడుదలలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

జనవరి 2025 నుండి జూన్ 2025 వరకు చెల్లించాల్సిన స్టైపెండ్లు మరియు బకాయిల బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది డాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ జూడ అసోసియేషన్ పేర్కొంది.

శాఖాపరంగా అన్ని విధివిధానాలు పూర్తి చేసి, బిల్లులకు ఆమోదం లభించినప్పటికీ, ప్రస్తుతం అవి ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయని జుడా ప్రతినిధులు తెలిపారు.

బోధనాస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ఈ నిర్లక్ష్యం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నెల నుండి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని వారు గుర్తు చేశారు.

ప్రమాదంలో 2021, 2022 బ్యాచ్‌ల ప్రయోజనాలుబకాయిల విడుదలలో జరుగుతున్న ఈ ఆలస్యం కారణంగా పలువురు డాక్టర్ల కెరీర్ మరియు ఆర్థిక స్థితిగతులు ప్రభావితమవుతున్నాయి.

ఎండి పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారు తమ పాత బకాయిలను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.ఇటీవల ఎండి పూర్తి చేసిన వీరు కూడా పెండింగ్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల బకాయిలు కూడా అదే అనిశ్చితిలో కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ వైద్య సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జుడా డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు తక్షణమే ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలని కోరింది.

ఒకవేళ పదేపదే విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోతే, జూనియర్ డాక్టర్ల హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అసోసియేషన్ హెచ్చరించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments