ఆలయాల్లో చోరీలు చేస్తున్న పాతనేరస్తుడి నందిపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందిపేట మండల కేంద్ర సమీపంలోని ఐలాపూర్ సబ్‌స్టేషన్ కెనాల్ కట్ట వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు.
అతని వద్ద నుంచి 12 గ్రాముల బంగారం, 22 గ్రాముల వెండితో పాటు ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఐలాపూర్ కెనాల్ కట్ట వద్ద వాహనాల తనిఖీలలో పల్సర్ బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.
ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో సదరు వ్యక్తి మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దర్పల్లి సాయిలు (42) గా గుర్తించారు.
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన సాయిలు, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో, ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.నిందితుడి వద్ద ఉన్న AP15BE 1126 నంబర్ గల పల్సర్ బైక్, దొంగిలించిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐలు శ్యామ్ రాజ్, రామ్‌తో పాటు ఆర్మూర్ రూరల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు మల్లేష్, నరేందర్, సుదర్శన్, కానిస్టేబుల్ అనిల్ కు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
