ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారి పట్ల స్థానిక గృహ యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
అద్దెదారులు, వలస కార్మికులు, ప్రైవేటు ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించడం ద్వారా భద్రతాపరమైన సమస్యలను ముందుగానే నివారించవచ్చని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పని కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు నకలు, మొబైల్ సంఖ్య, కుటుంబ వివరాలు, చేరిన తేదీ వంటి అంశాలను రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సీపీ ఆదేశించారు. నిర్మాణ రంగం, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమల్లో పనిచేసే వారి ప్రవర్తనను యాజమాన్యాలు నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు.
అవసరమైన పక్షంలో సంబంధిత వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని సూచించారు. పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యం, అప్రమత్తతతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని సీపీ వివరించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి సమాజ భద్రతలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
