HomeTelanganaNizamabadధన్‌పాల్.. దమ్ముంటే డిబేట్‌కు రా!..రెండేళ్లలో అభివృద్ధి శూన్యం..మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల "నిజామాబాద్ అభివృద్ధిపై దమ్ముంటే...

ధన్‌పాల్.. దమ్ముంటే డిబేట్‌కు రా!..రెండేళ్లలో అభివృద్ధి శూన్యం..మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల “నిజామాబాద్ అభివృద్ధిపై దమ్ముంటే ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు రా.. తేదీ, సమయం నువ్వే నిర్ణయించు.. నేను సిద్ధం” అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సవాల్ విసిరారు.

సోమవారం ఎల్లమ్మగుట్టలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర ఏళ్ల కాలంలో నగరాన్ని అంధకారంలోకి నెట్టడమే తప్ప, ఎమ్మెల్యే సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు నగరాన్ని తన సొంత ట్రస్టు నిధులతో అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన ధన్‌పాల్, ఇప్పుడు ఆ ట్రస్టును ఎక్కడ దాచారని ప్రశ్నించారు.

“నీకు పది బట్టల షాపులు ఉన్నాయి.. ఒక్క పేదవాడికైనా బట్టలు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?” అని నిలదీశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంత ఖర్చులతో 25 వేల మందికి పైగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు వస్త్రదానం చేశానని గుర్తు చేశారు.

కేవలం తన వ్యక్తిగత వ్యాపారాలు చక్కబెట్టుకోవడానికే ఎమ్మెల్యే అయ్యారా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో 50 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ 70 కార్యాలయాలు ఒకే చోట ఉండేలా అధునాతన కలెక్టరేట్, కొత్త మున్సిపల్ భవనాన్ని నిర్మించాం.

మినీ ట్యాంక్ బండ్, సెంటర్ మీడియన్ పనులు, విద్యుత్ వెలుగులతో నగరాన్ని మెరిపించాం. ఆర్మూర్, బోధన్, వర్ని రోడ్ల విస్తరణతో పాటు బైపాస్ రోడ్డును పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సొంత గ్రామంలో విఠలేశ్వర ఆలయంతో పాటు నగరంలో సాయిబాబా, పెద్దమ్మ గుడి, మార్కండేయ ఆలయాల నిర్మాణానికి సహకరించామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని గణేష్ బిగాల ధ్వజమెత్తారు. “తులం బంగారం, రూ.4 వేల పెన్షన్, స్కూటీలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడని కాంగ్రెస్ నాయకులు, తాము అధికారంలో లేమని ఎమ్మెల్యే కాలక్షేపం చేస్తున్నారని, దీంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తాము తెచ్చిన రూ.100 కోట్ల నిధులను తామే తెచ్చామని చెప్పుకోవడం ధన్‌పాల్ చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. “మేము నాటిన చెట్లకు నీళ్లు పోయలేరు.. మేము వేసిన పోల్స్ కు బల్బులు వేయలేరు..

కనీసం గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో మీరున్నారు” అంటూ ప్రస్తుత పాలనపై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతు కిరణ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments