ఇందూరు: ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని నిలబెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం సారంగాపూర్, నీరుగొండ హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ పవిత్రమైన రోజు మనమందరము ఒక సంకల్పం చేయాలని, సమాజ సేవలో ముందుండాలన్నారు. ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొలిపే రోజు అన్నారు. శ్రీరాముడి సేవలో హనుమంతుడు చూపిన అంకితభావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అన్నారు.
భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయస్వామి అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇందూరులో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర తెలంగాణలోనే అతిపెద్ద శోభాయాత్రగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, పుట్ట వీరేందర్, మాయావార్ కృష్ణ, పవన్ ముందడ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
