గణేశ్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రజలు, గణేశ్ మండళ్ల నిర్వాహకులు, అన్ని మతాల వారు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో మొత్తం 5,811 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 9, 11 రోజుల పాటు మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనాలు చేపట్టారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలతోపాటు బాసర బ్రిడ్జి, ఉమ్మెడ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ తెలిపారు.
వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు సార్వజనిక గణేశ్ మండళ్లు, విగ్రహాల నిర్వాహక కమిటీలు, మసీదు కమిటీలు, అన్ని మతాల ప్రజలు పోలీసులకు సహకరించారని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, అబ్కారీ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందించారని తెలిపారు.
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గజ ఈతగాళ్లు కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వాములయ్యారని చెప్పారు.ఉత్సవాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందితోపాటు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గణేశ్ మండళ్ల నిర్వాహకులు, మీడియా ప్రతినిధులకు సీపీ సాయి చైతన్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందించిన సహకారాన్ని అభినందించారు.
