గమ్యం చేరుకోవాలన్న ఆత్రుత.. కమ్మని నిద్రలో కంటున్న కలలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ కలలన్నీ కన్నీటి గాథలుగా మిగిలిపోయాయి. కన్నతల్లి వెచ్చని ఒడిలో సేదతీరుతున్న ఆ ఏడేళ్ల పసివాడికి, అదే తన చివరి నిద్ర అని తెలియదు.గురువారం అర్ధరాత్రి వేళ ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో తల్లి,కొడుకుతో పాటు మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.ఇందల్వాయి ఎస్ఐ సందీప్ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ నుంచి అకోలా వైపు డ్రైవర్‌తో సహా మొత్తం 22 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరిందనీ తెలిపారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో గన్నారం వద్దకు చేరుకోగానే, డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతో బస్సు నియంత్రణ తప్పి ఉంటుందని అనుకున్నామని అన్నారు . ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న షైన్ బోర్డులను బలంగా ఢీకొట్టి బోల్తా పడిందనీ అన్నారు.
నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో ఇరుక్కుపోయారనీ అన్నారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర వాసి జిల్లాకు చెందిన మంజూష (30), ఆమె ఏడేళ్ల కుమారుడు రిషి,అలాగే బెంగుళూరు కు చెందిన అబ్బాస్(45), అలాగే రాహుల్ (30) మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
