తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల బాలికను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం ఉదయం బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో చోటుచేసుకుంది.
తాడ్కోల్కు చెందిన రఫీ తన కుమార్తె ఫాతిమాతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫాతిమా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
