ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99 డేస్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 8వ డివిజన్లో సోమవారం సందడి నెలకొంది. డివిజన్ పరిధిలోని నాలుగు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ల జనరల్ బాడీ సమావేశాలను ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాంనగర్ కాలనీలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ‘ఇంద్రమ్మ చీరలను’ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ మఠం పవన్ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని పేర్కొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు వివరించారు.
మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.మెప్మా సీఓ అశోక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు జనరల్ బాడీ సమావేశాల ద్వారా తమ ప్రగతిని సమీక్షించుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్, వివిధ సంఘాల ఆఫీస్ బేరర్లు, పద్మశాలి సంఘ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చీరల పంపిణీ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
