నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా నుంచి సుమారు 17 పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. బాసరకు చెందిన షేక్ అర్బాజ్ అలియాస్ మయా, షేక్ ఇమ్రాన్ అలియాస్ అబూ గతంలో నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పరిధిలో బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకు వెళ్లారనీ తెలిపారు.
వీరిపై గతంలో 10 కేసులు ఉన్నాయనీ తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యాక మరో ఇద్దరు నిందితులు షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
గత రెండేళ్లుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని బాసర, ముధోల్, భైంసా, నవీపేట్, మాక్లూర్ వంటి ప్రాంతాల్లో కేవలం పల్సర్ బైక్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా చోరీ చేసిన బైక్లను మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాయగావ్ ప్రాంతాలకు చెందిన రిసీవర్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారన్నారు.
నవీపేట్ ఎస్సై కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అయ్యప్ప ఆలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకున్నారనీ అన్నారు. వారిని విచారించగా అంతర్రాష్ట్ర దొంగతనాల వ్యవహారం బయటపడింది.
పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. ఈ ముఠా అరెస్టుతో రెండు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 15 కేసులు పరిష్కారమయ్యాయనీ పేర్కొన్నారు.నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేసును ఛేదించడంలో చాకచక్యం ప్రదర్శించిన ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, క్రైమ్ పార్టీ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
