రోగులకు దిక్కులేని పరిస్థితి.నిజామాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. పాలనాపరమైన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపం ఆసుపత్రిని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు కరువై రోగులు నానా ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా నాలుగు రోజులుగా ఎక్స్-రే మిషన్ మొరాయించినా, కనీసం స్పందించే నాథుడే కరువయ్యారు.అప్పటి నుండి రోగులకు పరీక్షలు నిలిచిపోయాయి. ప్రమాదాల్లో గాయపడిన వారు, అత్యవసర చికిత్స అవసరమైన బాధితులు ఎక్స్-రే కోసం గంటల తరబడి బారులు తీరుతున్నారు. దిక్కుతోచని స్థితిలో రోగులు రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఎక్స్-రే యంత్రంపై ఆధారపడుతున్నారు. అక్కడ కూడా రద్దీ విపరీతంగా పెరిగి, రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా, యంత్రం మరమ్మతులపై కనీసం దృష్టి సారించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.ఆసుపత్రికి నిత్యం 2,000 మందికి పైగా రోగులు వస్తుంటారు. అయితే, ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియతో ఇక్కడ పరిస్థితి దయనీయంగా మారింది.కీలకమైన సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయకుండా, డిప్యూటీ సూపరింటెండెంట్‌తోనే నెట్టుకొస్తున్నారు.పదుల సంఖ్యలో వైద్యులు బదిలీపై వెళ్లగా, కొత్తగా వచ్చిన వారు వేళ్ళ మీద లెక్కపెట్టేంత మందే ఉన్నారు. నర్సింగ్ సిబ్బంది కొరత కూడా తోడవడంతో వైద్య సేవలు కుంటుపడ్డాయి. వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు, ఇతర వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు.సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదలే. ఎక్స్-రే వంటి చిన్న పరీక్ష కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్తే వేల రూపాయలు ఖర్చవుతాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని గొప్పలు చెప్పుకునే అధికార యంత్రాంగం, కనీసం ఎక్స్-రే మిషన్లను కూడా బాగు చేయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఎక్స్-రే మిషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని, ఆసుపత్రికి పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
