జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ వి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.
వీటిని నియంత్రించాల్సిన బాధ్యత విద్యాశాఖపైనే ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో నెలకొన్న ఈ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వి నాయకులు కాళీచరణ్, రవి, అరవింద్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
