రానున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు సిద్ధం చేస్తున్న కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడ అభ్యర్థులకు, సిబ్బందికి అవసరమైన వసతులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రాల సందర్శనలో భాగంగా కమిషనర్ గదుల సౌకర్యం, వెలుతురు, త్రాగునీరు ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నామినేషన్ల పర్వం మొదలయ్యే నాటికి ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు కూడా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్రాల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలి.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడటంతో పాటు, వేసవి దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయంతో బారికేడ్లు, క్యూ లైన్ల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన బాధ్యతలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
తక్షణమే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసి, కేంద్రాలను సిద్ధం చేయాలని ఆయన సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఈ తనిఖీలో కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాల ఉన్నతాధికారులతో పాటు సంబంధిత వార్డు అధికారులు పాల్గొన్నారు.
