నకిలీ పత్రాలతో కరెంట్ అకౌంట్లుముఠా వెనుక భారీ నెట్‌వర్క్నిందితుల్లో బోధన్ వాసులు..రంగంలోకి ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’అమాయకుల పేరిట నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నిజామాబాద్ నాలుగవ టౌన్ పోలీసులు రట్టు చేశారు.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఖాతాల ద్వారా సుమారు రూ. 31 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించి అధికారులు విస్తుపోయారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’లో భాగంగా బోధన్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
బోధన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అజర్, శ్యామల నవీన్, ఖాసిం పటేల్, మహమ్మద్ మినాజ్ అహ్మద్, సయ్యద్ హఫీజ్ అనే వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు వివిధ వ్యక్తుల పేర్లతో, నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి బ్యాంక్ అకౌంట్లు (ముఖ్యంగా కరెంట్/బిజినెస్ అకౌంట్లు) తెరిచేవారనీ తెలిపారు.
అనంతరం ఈ ఖాతాలను మధ్యవర్తుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ మోసగాళ్లకు భారీ మొత్తానికి విక్రయించేవారనీ పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును నేరుగా ఈ ఖాతాల్లోకి మళ్లించి, తద్వారా పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేవారన్నారు.
నాల్గవ టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సమన్వయంతో జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నిందితులు విక్రయించిన ఖాతాల్లో గత మూడు నెలల్లోనే రూ. 31 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి.
ఈ భారీ మొత్తం వివిధ రకాల సైబర్ మోసాల ద్వారా సేకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ప్రజలకు పోలీసుల సూచనలుసైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇతరులకు ఇవ్వడం లేదా విక్రయించడం శిక్షార్హమైన నేరం. ఓటీపీ, పిన్, సీవీవీ వంటి వివరాలను ఎవరికీ తెలపకూడదు.తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆఫర్లను నమ్మవద్దు.
సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలను పేర్కొన్నారు.
