నగరంలో గురువారం (ఏప్రిల్ 2) నిర్వహించనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రను పురస్కరించుకుని పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులు ప్రశాంత వాతావరణంలో యాత్రను ముగించుకునేలా 1,300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం కేవలం స్థానిక పోలీసులే కాకుండా.. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు.
వీరికి తోడుగా టీఎస్‌ఎస్పీ బెటాలియన్ సిబ్బంది, 20 స్పెషల్ పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించనున్నాయి. శోభాయాత్ర సాగే దారి పొడవునా హైటెక్ నిఘా ఏర్పాటు చేశారు. యాత్ర కదలికలను ఎప్పటికప్పుడు పైనుంచి పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
సున్నిత ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలను అమర్చి, కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎత్తైన భవనాలపై నుంచి నిఘా ఉంచేందుకు సిబ్బందికి బైనాక్యులర్లను కేటాయించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొత్తగా ఇంటర్సెప్టర్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి.నట్టు తెలిపారు.
శోభాయాత్ర నిర్వాహకులు, భక్తులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పాత నేరస్తులపై ఇప్పటికే నిఘా పెంచామని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాత్రను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
