Thursday, April 23, 2026
HomeTelanganaNizamabadమొదలైన వరి కోతలు.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు..తక్కువ ధరకే దళారులకు ధాన్యం విక్రయం...ప్రభుత్వ నిర్ణయం...

మొదలైన వరి కోతలు.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు..తక్కువ ధరకే దళారులకు ధాన్యం విక్రయం…ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న రైతాంగం

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా.. దానిని అమ్ముకునేందుకు ప్రభుత్వ తోడ్పాటు అందడం లేదు. నిజామాబాద్ జిల్లాలోనే అత్యంత వేగంగా వరి కోతలు ప్రారంభమయ్యే బోధన్ డివిజన్ పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. కోతలు మొదలై వారం గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు.

అదును చూసి దళారులు, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రతి ఏటా జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే నెల రోజుల ముందే బోధన్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కోతలు ఊపందుకున్నాయి.

ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.31 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, డివిజన్ల వారీగా చూస్తే నిజామాబాద్‌లోనే అత్యధికంగా 1.10 లక్షల ఎకరాల్లో సన్న రకం, 13,831 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు. అలాగే ఆర్మూర్ డివిజన్‌లో సన్న రకం 67,210, దొడ్డు రకం 5,786 ఎకరాలు, భీమ్‌గల్ డివిజన్‌లో సన్న రకం 48,047, దొడ్డు రకం 39,415 ఎకరాల్లో పంట సాగులో ఉంది.

ఒక్క బోధన్ డివిజన్‌లోనే సన్నరకం 86,928 ఎకరాల్లో, దొడ్డు రకం 1,487 ఎకరాల్లో సాగు చేశారు. వారం రోజులుగా యంత్రాలు పొలాల్లో తిరుగుతున్నా.. ధాన్యం సేకరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టే సౌకర్యం లేక, కళ్ళాల వద్దే పచ్చి ధాన్యాన్ని దళారులకు కారుచౌకగా విక్రయిస్తున్నారు.

అధికారులు గన్ని సంచుల సేకరణ, రైస్ మిల్లుల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమై ఉండగానే.. ఇక్కడ సగం పంట ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. “మరో వారం రోజుల్లో కోతలు మరింత వేగవంతం కానున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కేంద్రాలను ప్రారంభించాలి” అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!