జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం తొలి అంకానికి తెర లేచింది. మొదటి విడతలో భాగంగా నోటిఫికేషన్ విడుదలైన 184 సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో అన్ని కేంద్రాల్లోనూ సందడి వాతావరణం కనిపించింది.
జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు, ఈ 184 స్థానాలకు గాను మొత్తం 1167 నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కేవలం చివరి రోజు శనివారం మాత్రమే 863 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. అలాగే మొత్తం 1642 వార్డు స్థానాలకు కేవలం శనివారమే 3151 నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మొత్తం 3533 నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇక బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం, పోతంగల్ గ్రామ పంచాయతీ లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.రెండు గ్రామాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇది ఎన్నికల అధికారులను, రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది.
దానిపై అధికారులు ఆరా తీయగా గ్రామస్థులు ఎవ్వరికి కూడా ఆసక్తి లేదని తెలిపారు. అయితే నామినేషన్ దాఖలు అయిన గ్రామాల్లో సగటున ప్రతి సర్పంచ్ స్థానానికి సుమారు 5 నుంచి 6 మంది అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు మారిన చోట్ల, మహిళా రిజర్వుడు స్థానాల్లో పోటీ మరింత పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
మొదటి దఫా ఎన్నికలలో నామినేషన్ దాఖలు ఆదివారం పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడించనున్నారు. సోమవారం అప్పీళ్ల స్వీకరణ, డిసెంబరు 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబరు 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచి ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.
రెండు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం..
జిల్లాలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ మొదలైన సందర్భంగా, రెండు సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎటువంటి పోటీ లేకుండానే అభ్యర్థులు తమ స్థానాలను దక్కించుకున్నారు.
బోధన్ మండలంలో పెద్ద మావంది గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే ఎడపల్లి మండలంలో బాపూనగర్ గ్రామ సర్పంచ్‌గా అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఇద్దరు అభ్యర్థులు గ్రామ పెద్దలు, ఇతర నాయకుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలుపుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు:
రేపటి నుంచి రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 2 వరకు తుది గడువు విధించారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయించనున్నారు. వచ్చే నెల 14న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు.
