100 బృందాలు.. 3,000 మంది సిబ్బందితో విస్తృత నాకాబందీ
స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీపీ సజ్జనర్
725 వాహనాలు డిటైన్.. 48 మంది అనుమానితులు అదుపులోకి
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వేళ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరిట నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 15న గురువారం అర్ధరాత్రి 1:00 గంట నుంచి తెల్లవారుజామున 3:00 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద చేపట్టిన ఈ ఆపరేషన్లో 100కు పైగా బృందాలు, దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిటీ కమిషనరేట్ వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. చంద్రాయణగుట్ట పరిసరాల్లో కాలినడకన తిరిగి వాహనాల తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, అనంతరం మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్ సమీపంలో, ఆరాంఘర్ / ఆర్జీఐఓ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషాబాద్ సతమ్రాయ్ వద్ద, అత్తాపూర్ పోలీసులు నిర్వహించిన హైదర్గూడ పిల్లర్ నెం. 133 వద్ద, బండ్లగూడ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వాహన తనిఖీలను పరిశీలించి అధికారులకు తగిన మార్గదర్శకాలు అందించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 725 వాహనాలను పోలీసులు డిటైన్ చేయగా, 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 5 మైనర్ డ్రైవింగ్ కేసులు, ఒక ఆయుధం, 2 గంజాయి సంబంధిత కేసులతో సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. జోన్ల వారీగా పరిశీలిస్తే.. గోల్కొండ జోన్లో అత్యధికంగా 213 వాహనాలు డిటైన్ కాగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు; ఇక్కడ 2 మైనర్ డ్రైవింగ్, ఒక గంజాయి కేసు నమోదైంది. శంషాబాద్ జోన్లో 182 వాహనాలను డిటైన్ చేశారు. చార్మినార్ జోన్లో 127 వాహనాలను డిటైన్ చేసి, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్లో 100 వాహనాలను డిటైన్ చేసి, 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు; ఇక్కడ ఒక గంజాయి కేసు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, 23 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ జోన్లో 45 వాహనాలు డిటైన్ కాగా, 2 మైనర్ డ్రైవింగ్, ఒక COTPA కేసు నమోదైంది. ఖైరతాబాద్ జోన్లో 40 వాహనాలు, జూబ్లీహిల్స్ జోన్లో 18 వాహనాలను డిటైన్ చేసి, 23 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో ఒక మైనర్ డ్రైవింగ్, 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ... నేరస్థులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను వంచడం, అక్షరాలు కనిపించకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనివల్ల వారు తీవ్రమైన నేర కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చే వారిపై చీటింగ్, ఫోర్జరీ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లను స్పష్టంగా ఉంచుకోవాలని, వాహనం నడుపుతూ ఇయర్ఫోన్లు ధరించకూడదని, వాహన సంబంధిత ధ్రువపత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పౌరులంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో అదనపు సీపీలు ఎం.శ్రీనివాసులు (క్రైమ్స్), తఫ్ఫ్సీర్ ఇక్బాల్ (లా అండ్ ఆర్డర్), జాయింట్ సీపీ డి.జోయల్ డెవిస్ (ట్రాఫిక్), డీసీపీలు ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్.చైతన్య కుమార్, కిరణ్ ఖారే, కె.శిల్పవల్లి, ఎస్.శ్రీనివాస్, జె.రాఘవేందర్ రెడ్డి, ఎ.రమణారెడ్డి, బి.రాజేష్, కె.వెంకటలక్ష్మి, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
