శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.
ఎవరు కూడా గోదావరి నది పరిసరాల్లోకి వెళ్లవద్దని, అవాఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు.
డ్యామ్ సైట్ పైకి చేరుకుని, ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని, 41 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు. ఎస్సారెస్పీలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి 2.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.00 టీఎంసిలకు గాను, ప్రస్తుతం 1088.0 అడుగులు, 70.140 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉంచుతూ, సుమారు 2.60 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు.
ఇందులో వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నామని, మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదల అవుతోందని తెలిపారు. అయితే, నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ, ఎక్కడ కూడా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు.
నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చి అనవసర తప్పిదాలకు పాల్పడితే పరీవాహక ప్రాంతాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు. అంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్, సీపీలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పంటలకు సాగు నీటి విషయమై రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో గడిచిన మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీటి నిల్వలను సంతరించుకున్నాయని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలతో పాటు, వచ్చే రబీ సీజన్ కూడా పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ కి చెందిన జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా చెరువులు, వాగులకు గండ్లు పడకుండా, ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు.
జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయితే ప్రజలు జలాశయాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి మిగులు జలాలను విడుదల చేసినందున ఎస్సారెస్పీకి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సుమారు 4 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల మరో మూడు రోజుల పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగనుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దిగువ పరీవాహక ప్రాంతాలైన మెండోరా, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి తదితర మండలాల పరిధిలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు, ఈత కోసం వెళ్లవద్దని సూచించారు.
ఈ మేరకు పోలీస్, రెవెన్యూ సిబ్బందిచే నిఘాను కూడా ఏర్పాటు చేయించామని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో రహదారులపై నుండి నీరు ప్రవహిస్తున్న చోట వాహనాల రాకపోకలను నిలిపివేయించామని, ఇతర మార్గాల గుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయించామని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వి.లావణ్య, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
