మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో భారీగా యంత్రాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నందిపేట్ ఎస్సై తెలిపారు.
ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాపూర్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై బృందం సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో మొరం తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక హిటాచీ-200 చైన్ మిషన్ ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న దాస్‌నగర్‌కు చెందిన నలుగురు,మాదాపూర్‌కు చెందిన ఒకరు,దేహగం గ్రామానికి చెందిన ఒకరు..
మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, యంత్రాలను సిజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.
