బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలే నేడు రాష్ట్రానికి శాపాలుగా మారాయని, ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 100 పడకల ఆసుపత్రికి 2022లో పునాది వేసినా, రెండున్నర ఏళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుల కృషి వల్లనే ఆ పనులు నేడు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. 2021లో పునాది పడిన వెజిటబుల్ మార్కెట్ పనులు పూర్తి చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం 15 రోజుల ముందు బస్సు డిపోను హడావిడిగా ప్రారంభించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని, ఇలాంటి నాటకాలు ఎందుకు ఆడాల్సి వచ్చిందని నిలదీశారు.
నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశాంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని మోహన్ రెడ్డి హితవు పలికారు. ఇప్పటికే భీంగల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 28 కోట్లతో పనులను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.
ఇందులో రూ. 7 కోట్ల పనులు ఇప్పటికే పూర్తికాగా, రూ. 4 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మరో రూ. 15 కోట్ల పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నాయని వివరించారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావని ఆయన స్పష్టం చేశారు.
