రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అవసరమైతే ఆయా సంస్థల గుర్తింపును రద్దు చేయించే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈగల్ విభాగం ఉన్నతాధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ డ్రగ్స్ నియంత్రణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కళాశాలలో తప్పనిసరిగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ కోసం ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక సమన్వయకర్త (కో-ఆర్డినేటర్)ను నియమించాలని ఆదేశించారు. విద్యార్థులు కళాశాలల్లో చేరే ప్రారంభ దశలోనే మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, ఇందుకోసం సైకాలజిస్టులు, నిపుణుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.ఈగల్ అధికారులు రూపొందించిన కార్యాచరణ ముసాయిదాను పరిశీలించిన డీజీపీ, అమలు విధానాల్లో కొన్ని మార్పులు సూచించారు.
పోలీస్, విద్య, ఆరోగ్య శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు) రూపొందించాలని ఆదేశించారు. త్వరలో మరోసారి సమావేశమై తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యాసంస్థలు భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే కేంద్రాలని, అలాంటి ప్రాంగణాల్లో డ్రగ్స్‌కు ఏమాత్రం స్థానం ఉండకూడదని డీజీపీ స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థికి సురక్షితమైన, మాదకద్రవ్యాల రహిత విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.సమీక్షా సమావేశంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
