వచ్చే నెలలోనే హైదరాబాద్ బోనాల జాతర ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని జూలై 19న గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పిస్తారు. అప్పటి నుంచి నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి .
నాటి నుంచి ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు ఉంటాయి.ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టాలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఆగస్టు 2 (ఆదివారం): లష్కర్ (సికింద్రాబాద్) ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తారు.
ఆగస్టు 3 (సోమవారం): సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పవిత్ర ‘రంగం’ (భవిష్యవాణి) కార్యక్రమం, అనంతరం అంబారీపై అమ్మవారి సాగనంపే ఊరేగింపు వైభవంగా జరుగుతాయి. గోల్కొండతో ప్రారంభమయ్యే ఈ జాతర.. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ముగుస్తుంది.
ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు. గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ ఏడాది ఆషాఢ బోనాల జాతర ముగియనుంది. బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు ఏర్పాటు చేస్తోంది.
