22ఏ సెక్షన్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్ పట్టా భూములు, నివాస గృహాలు, వ్యవసాయ భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.
దీనివల్ల లక్షలాది కుటుంబాలు తమ ఆస్తులను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పార్టీ నేతలు ధ్వజమెత్తారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ వాటిని విక్రయించుకోలేక, అవసరాలకు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
22ఏ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ గురువారం నిజామాబాద్ ధర్నాచౌక్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సూచనల మేరకు వారం రోజులపాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో 22ఏ భూముల సమస్యపై పోరాటం చేస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై, అనంతరం యువత సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణంలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆటోలో తిరుగుతూ ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే కేసీఆర్‌ను విమర్శించడం, అసభ్య పదజాలంతో మాట్లాడటం మానుకోవాలని సూచించారు.
కేసీఆర్ బయటకు రావాలని సవాళ్లు విసరడం సరికాదన్నారు. కేసీఆర్ పిలుపునిస్తేనే రాష్ట్రవ్యాప్తంగా గులాబీ సైన్యం కదులుతోందని పేర్కొన్నారు. ఆయన ప్రత్యక్షంగా ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేకమంది నాయకులతో పోరాడారని, ఆంధ్ర నాయకులను ఎదుర్కొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని నేతలు పేర్కొన్నారు.
దేశంలోని వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ నేతలు తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి కేసీఆర్ కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నారని, రైతుగా తన పని తాను చేసుకుంటూ వ్యవసాయంపై దృష్టి పెట్టారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సూచనల మేరకు వారం రోజులపాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
రానున్న రోజుల్లో మరింతగా నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతు కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
