పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బోధన్ పట్టణంలోని 26, 35వ వార్డులలో నిర్వహించిన వార్డు సభలలో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంతో సభలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా వార్డు సభ వేదికల వద్ద ఫిర్యాదుల బాక్సులను అందుబాటులో ఉంచారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ఒక్కో పథకం వారీగా పేరుపేరున ప్రకటించారు ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర వాటి ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి వార్డు సభలలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. పట్టణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు.
ప్రభుత్వం రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, చేయూత పథకం కింద పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందని అన్నారు.
ఎక్కడైనా అవకతవకలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తేవాలని సూచించారు. అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే, ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందని భరోసా కల్పించారు.
ముఖ్యంగా తొలివిడత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు తుది దశకు చేరాయని, త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనుందని అన్నారు. గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గుడిసెలలో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, అంగన్వాడీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహార పథకం, మద్యాహ్న భోజన పథకం అమలు చేయనుందని వివరించారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. కాగా, 26వ వార్డులో రేఖమ్మ అనే మహిళ భర్త ఇటీవలే మృతి చెందగా, ఆమెకు రెండు పడక గదుల ఇల్లు మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్త సేకరణ కోసం ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల సిబ్బందికి తడి-పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా వార్డుల అభివృద్ధిపై స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించారు. వార్డు సభలలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, కార్పోరేటర్ దామోదర్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్కో ి ఏడీఈ ముఖ్తార్, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
