ఇంటి డాబా పై నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును దుండగులు తెంచుకెళ్లిన ఘటన నవీపేట మండలం సిరాన్‌పల్లి గ్రామంలో అర్ధరాత్రి కలకలం రేపింది.స్థానికుల సమాచారం మేరకు..గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళ ఎండవేడిమి కారణంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి డాబాపై నిద్రించారు.
అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మెల్లగా డాబాపైకి చేరుకున్నాడు. నిద్రిస్తున్న శ్రావణి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును ఒక్కసారిగా తెంచుకొని అక్కడి నుండి పరారయ్యాడు. మెడలో తాడు తెంచుతుండగా మెలుకువ వచ్చిన శ్రావణి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచారు.
అయితే అప్పటికే దొంగ చీకట్లోకి పరారయ్యాడు. బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
