గురువారం నాయి బ్రాహ్మణ సంఘం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ డివిజన్‌లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు, పూడికతో నిండిన మురికి కాలువలు, అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు.
వీటితో పాటు వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రజలు పెద్ద ఎత్తున వినతిపత్రాలను అధికారులకు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న 8వ డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ సెక్రెటరీ మఠం పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
అందిన వినతిపత్రాలను ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ మహేందర్, మున్సిపల్ ఏఈ వాజిద్, 5వ టౌన్ ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, పలువురు ఆర్పీలు, బీజేపీ నాయకులు శివ, క్రాంతి, శరత్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
